MAIN MENU

✿ ఈ బ్లాగు విజ్ఞాన శాస్త్ర అభిమానులకు కొంత సమాచారం అందించేందుకు ఉద్దేశించబడినది. ఇందులో ఉన్న సమాచారాన్ని విద్యా బోధన, అభ్యసన కొరకు వినియోగించుకోవచ్చును. ✿

IMPORTANCE OF SCIENCE DAY - Dr.CHAGANTI KRISHNAKUMARI


జాతీయ విజ్ఞానశాస్త్ర దినోత్సవం ప్రాముఖ్యత

1921 సంవత్సరంలో ఒక ఓడ లండన్ ఓడ లండన్ ఓడరేవు నుండి బయలుదేరి కలకత్తా వైపుకి ప్రయాణిస్తున్నది. వాయులీనం వల్ల పొందగలిగే ధ్వని కంపనాలు, అనువాదాలు వంటి భౌతికశాస్త్ర విషయాంశాలపై ఆక్స్‌ఫర్డు లో జరిగిన సదస్సులో ప్రసంగించి వస్తున్న ఒక యువకుడు ఆ ఓడ ప్రయాణీకుల్లో ఉన్నాడు. అతడు కలకత్తా విశ్వవిద్యాలయానికి చెందిన భారతీయుడు. తలపాగా చుట్టుకొని పున్నాడు. ఈ యువకునికి రంగులీనే వస్తువులంటే ప్రీతి. అవి పువ్వులు కానీయండి,  సీతాకోక చిలుకలు కానీయండి లేదా వజ్ర వైఢూర్యాలవంటి జాతి రత్నాలు కానీయండి. మెడిటరేనియన్ సముద్రంలో ప్రయాణిస్తున్న ఇతని చూపు సహజంగానే సముద్రపు నీలివర్ణంపై నిలిచింది. తదేకంగా దానివైపే చూస్తూ ఆ వర్ణ సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఈ లక్షణంతో పాటు అతనికి ప్రశ్నించే మెదడు వుంది. అది నిరంతరం ప్రశ్నలను సంధిస్తూ వుంటుంది. సరియైన సమాధానం దొరికేదాకా అదేపనిగా ఆలోచిసూ ప్రయోగాలు చేసి చూసి ఒక నిర్ధారణకు వచ్చే దాకా నిద్రపోడు. ఇది శాస్త్రజ్ఞుని లక్షణం. ఇంత అందమైన నీలిరంగుకి కారణం ఏమిటి? అన్న ఆలోచనలో మునిగి రెప్పవాల్చకుండా సముద్రాన్ని చూసూ కూర్చున్నాడు. సముద్రంలోనున్న అసంఖ్యాకములైన నీటి అణువులు సూర్యకాంతి తమ మీదపడగా ఆ తెల్లని కాంతిలోని నీలి భాగపు కాంతిని విరజిమ్ముతున్న కారణంగానే సముద్రం ఇంతటి నీలివర్ణంతో వుందని అతనికి అపుడు తోచింది. తన ఊహ నిజమౌనో కాదో నిరూపణ కోసం అప్పటికప్పుడు సముద్రం నీటిని కొంత సేకరించి ఓడ డెక్ పైన కూర్చొని నికెల్ ఫ్రిజంతో  కొన్ని ప్రయోగాలు చేసాడు. కలకత్తా చేరుతూనే విస్తృతంగా మరిన్ని ప్రయోగాలు చేసి తన సిద్ధాంతాన్ని నిరూపించాడు. ఆ ప్రయోగ ఫలితాలే ప్రముఖమైన ఆవిష్కరణకి దారితీశాయి. 1998 ఫిబ్రవరి 28న కనుగొన్న ఈ ఫలితానికి తన పేరే పెడుతూ 1998 మార్చి16న "రామన్ ఎఫెక్ట్"గా ప్రకటించాడు, ఈ కృషి ఫలితం 1980లో అతనికి నోబెల్ బహుమతిని తెచ్చిపెట్టింది. ఇది భారతదేశ తనయుడిగా తొలిసారిగా  నోబెల్ పురస్కారాన్ని తెచ్చి పెట్టిన ఫలితము. భారతదేశానికే కాదు, ఆసియా ఖండానికే తొలిసారిగా అంతటి ప్రతిష్టాత్మకమైన బహుమతి లభింపజేసిన ఫలితము. అందుకే అది భారతదేశీయులకి గర్వకారణం.

రామన్ ఎఫెక్టును  కనుగొన్న ఈ భౌతిక శాస్త్రవేత్త పూర్తి పేరు చంద్రశేఖర వెంకట రామన్. సి.వి. రామన్‌గా  ప్రసిద్ధుడు. 1929లో బ్రిటిష్ ప్రభుత్వం “సర్"  బిరుదుతో సత్కరించింది.  అంతకు పూర్వమే దృశాశాస్రములో సాధించిన ఫలితాలను గుర్తించి 1924లో రాయల్ సొసైటీ ఫెలోగా ఎన్నుకొంది. సర్ సి.వి. రామన్ గారిని 1954లో భారత ప్రభుత్వం "భారతరత్న" ను ప్రదానం చేసి గౌరవించింది. మన పాఠశాల విద్యార్ధినీ విద్యార్థులకు ఈ సంగతులు తెలియనివి కావనుకొంటాను. కానీ రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణ ఎందుకు ఇంతటి ప్రాముఖ్యతను సంతరించుకొందో వారికి తెలియకపోవచ్చు! రామన్ ఎఫెక్ట్ కొన్ని రకాలైన పదార్ధాలు ప్రదర్శించే అభిలాక్షణిక ధర్మము. అది పదార్ధములోని అణువుల వ్యక్తిత్వాన్ని తెలుపగలిగే సరికొత్త సాంకేతిక పరిమాణం రూపొందడానికి హేతువు అయింది. పదార్థాల భౌతిక, రసాయనిక ధర్మాల అధ్యయనాలకీ, అణు నిర్మాణాల అధ్యయనాలకీ రామన్ వర్ణపట శాస్త్రం ఆవిర్భవించింది. ఆవిర్భవించినదే తడవుగా సుమారు 2000 రసాయన సమ్మేళనాల అణు నిర్మాణాలను శాస్త్రజ్ఞులు నిర్థారించగలిగారు. అనేక విభాగాలుగా అభివృద్ధి చెందుతూ ఈ వర్ణపటశాస్త్రం ఆధునికంగా పలు శాస్త్రరంగాల పరిశోధనలలో కీలక పాత్రను పోషిస్తూ ఆధిపత్యం వహిస్తున్నది. 1888 నవంబర్ 7న తిరుచునాపల్లిలో పుట్టిన సర్ సి.వి.రామన్‌ని మనం రామన్న తాతగా భావించుకొంటే ఈ తాత మనకు వదిలి పెట్టిన వారసత్వపు ఆస్తి రామన్ వర్ణపట శాస్త్రం. ఈ ఆస్తి భారతదేశీయులకే పరిమితమా? కాదు. విజ్ఞానశాస్రాలను చేపట్టిన ప్రతి ప్రపంచ పౌరుడికీ అతను వదలివెళ్ళిన సంపద. ఎన్నటికీ తరిగిపోని సంపద. దీనిని వాడుకొంటూ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న మరెన్నో ఆవిష్కరణలు మానవ సమాజానికి ఉపయోగపడే వస్తువులుగా విధానాలుగా రూపొందుతున్నాయి. అందువల్ల 1928 ఫిబ్రవరి 28వ రోజు మన భారతదేశ చరిత్రలో బంగారు అక్షరాలతో శాశ్వతంగా నిలిచిపోయిన రోజు. భారతీయ వైజ్ఞానికులకి అది ముఖ్యమైన తేదీ. అది వారికొక పండగ రోజు.

         మనం భారతీయులం. రామన్న తాతకి నేరుగా మనమే వారసులం అనుకొంటూ గర్వపడితే సరిపోతుందా లేక మనం ఆ తాత నుండి స్ఫూర్తిని పొందవలసిన కర్తవ్యం ఏదైనా మనపైన ఉందా? నేటి భారతీయ  పాఠశాల విద్యార్థినీ విద్యారులూ, యువతీ యువకులూ ఈ విషయమై దృష్టి సారించి తమ తమ జీవిత లక్ష్యాలను నిర్ణయించుకొని ఆ ప్రకారం కృషి చేయాల్సిన అవసరం వుందా లేదా? ఆ తాతకి నేరుగా మనమే వారసులం అనిపించుకోవాలా వద్దా?

          1986లో ఎన్.టి.ఎస్.సి చొరవ తీసుకొని భారత ప్రభుత్వానికి ఫిబ్రవరి 28ని "నేషనల్ సైన్స్ డే" (జాతీయ వైజ్ఞానిక దినం) గా ప్రకటించాలని అర్జీ పెట్టింది. 1987 ఫిబ్రవరి 28న తొలిసారిగా నేషనల్ సైన్స్ డే ఉత్సవాన్ని దేశవ్యాప్తంగా పాఠశాలలు, విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలు, శాస్త్రీయ, సాంకేతిక, వైద్య పరిశోధనా సంస్థలు ఘనంగా జరుపుకొన్నాయి. అప్పటినుండీ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28నాడు నేషనల్ సైన్స్ డే ఉత్సవాన్ని మనమంతా జరుపుకొంటున్నాము. రామన్ తాతగారిని తలచుకోవడం రామన్ ఎఫెక్ట్ గురించి చెప్పుకోవడానికీ, రామన్ తాతపై మన గౌరవాన్ని ప్రకటించుకోవడానికి మాత్రమే ఈ ఉత్సవ ఉద్దేశ్యం పరిమితం కాదు. ఫిబ్రవరి 28 పండుగకి కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. సైన్స్ సంబంధిత అంశాలను నలుగురి దృష్టికి తీసుకొని రావడానికి ఆ రోజు ఒక మంచి అవకాశం. ఆ సందర్భంగా దేశవ్యాప్తంగా జరిపే పలు కార్యక్రమాలలో ప్రజలు భాగస్వాములను చేయాలి. సైన్స్ అందిస్తున్న సదుపాయాలు, సైన్స్ చేపట్టవలసిన తక్షణ అంశాలు గురించిన అవగాహన కలిగించాలి. వైద్యం, చికిత్స రోగనివారణ, శక్తి ఉత్పాదన పరిసరాలకు సంబంధించిన అంశాలు, అంతరిక్ష పరిశోధనలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి రంగాలలో సైన్స్ వారికి ఏమి అందివ్వగలిగిందో ఎత్తిచూపాలి. వ్యవసాయముపై పరిసరాలపై ఆరోగ్యము, పరిశ్రమలు, మందుల తయారీపై బయోటెక్నాలజీ ప్రభావాన్ని తీసుకొని రావాలి. నిత్యజీవితంలో సైన్స్‌ను  ఎలా అన్వయించుకొంటున్నామో తెలియజెప్పాలి. పాఠశాల విద్యార్ధినీ విద్యార్థులలో వైజ్ఞానిక ప్రవృత్తిని అలవరచడానికి దోహదపడాలి. రాబోయే తరాల వారికి నూతన ఆవిష్కరణలు, ఆ రోజు వరకు సైన్స్ పరిశోధనల ద్వారా పొందగలిగిన వివరాలను సత్వరం అందిస్తూ మునుముందు వారు చేపట్టవలసిన అంశాలను నిర్ణయించుకోవడానికి సహాయపడాలి.

         ఈ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొంటూ మనదేశంలోని ప్రముఖ సంస్థలు నేషనల్ సైన్స్ డేని  పురస్కరించుకొని రకరకాల కార్యక్రమాలను ప్రతీ యేటా జరుపుతున్నాయి. ఆధునిక వైజ్ఞానికాంశాలపై నిష్ణాతులు సదస్సులలో ఉపన్యాసాలు ఇవ్వడం, వైజ్ఞానిక ప్రదర్శనలను ఏర్పాటు చేయడం, పాఠశాల, కళాశాల విద్యార్ధినీ విద్యారులకు సైన్స్ సంబంధించిన వ్యాసరచన, వక్తృత్వము సృజనాత్మక చిత్రకళ, స్లోగన్ల కల్పన అప్పటికప్పుడు ఇచ్చిన అంశంపై పోస్టర్లను రూపొందించడం వంటి పోటీలను నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమాలు ఫిబ్రవరి 28న మొదలుపెడుతూ లేదా ఆ రోజున పూర్తి అయ్యేటట్టుగా గానీ ఒక వారం పాటు, లేదా ఒక నెల రోజులజరుపుకోవాలి. ప్రతీ సంవత్సరం ఒక ప్రధానమైన అంశాన్ని ఎన్‌.సి.ఎస్.టి.సి ప్రకటించగా దానిపై ఈ కార్యక్రమాలు రూపొందించాలి. ఆ క్రమంలో 2005లో భౌతికశాస్త్రం, 2006లో ప్రకృతి పరిరక్షణ, 2007లో వ్యవసాయం, 2008లో భూగ్రహం. ఈ విధంగా అంశాలను ఎన్నుకొంటూ సామాన్య ప్రజానీకానికి రక్షితా త్రాగునీరు, అంటువ్యాధులు నివారణా, తీసుకోవలసిన జాగ్రత్తలవ్యవసాయ ఉత్పత్తులను పెంచుకొనే విధానాలు, జీవ వైవిధాకాపాడుకోవలసిన అవసరము వంటి అనేక విషయాలపై అవగాహన పెంచడం, భవిష్యత్తరాల వారికి ఆ విషయాలు అందేలా చూడడం  నేషనల్ సైన్స్ డే ఉద్దేశ్యంగా గత సంవత్సరాలలో ఉత్సవాలను జరుపుకొన్నాయి. 2012 సంవత్సరానికి "క్లీన్ ఎనర్జీ ఆప్షన్స్ అండ్ నూక్లియర్ సేఫ్టే", "పరిశుద్దమైన శక్తి ఉత్పాదనావకాశాలు కేంద్రకశక్తి భద్రత" అన్నఅంశానికి ప్రాధాన్యతనిసూ జరుపుకొన్నాము. 2013 సంవత్సరం కీలకాంశంగా జెనిటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ అండ్ ఫుడ్ సేఫ్టీని మన ప్రభుత్వం ప్రకటించింది. సైన్స్ ను పదిమందికీ తెలియజెప్పగలిగే వారిని అనగా సైన్స్ కమ్యూనికేటర్లను ప్రోత్సహిస్తూ అటువంటి వారి సంఖ్యను పెంచడం ఈ ఉత్సవాలను జరపడంలో మరో ముఖ్యమైన ఉద్దేశ్యం. సైన్స్ పరివ్యాప్తికి 1988 నుండి NCSTC జాతీయ పురస్కారాలను ప్రదానం చేస్తూ వారిని ప్రోత్సహిస్తున్నది. అయినప్పటికీ రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణ తరువాత మళ్ళీ ఈ రోజు దాకా మన దేశ చరిత్రలో ముఖ్యమైన దినంగా మనం పరిగణించుకొంటూ ప్రపంచ దేశాలకు మరో సరికొత్త వైజ్ఞానిక సంపదను అందివ్వగలిగే ఆవిష్కరణ మన దేశీయ ప్రయోగశాలల నుండి జరగలేదు. పోనీ మన ప్రజలకు బుద్ధి సంపద కొరవడిందా అంటే లేదు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మనదేశం శాస్త్ర పరిశోధన, అభివృద్ధి రంగంలో చాలామందుకి పోయిందనే చెప్పవచ్చు. భారతీయ మూలాలు గల వ్యక్తులైన హరగోవింద్ ఖోరానా, సుబ్రహ్మణ్యచంద్రశేఖర్, వెంకటరామకృష్ణన్‌ లకి వైద్యశాస్త్రం, అంతరిక్ష భౌతికశాస్త్రం, రసాయనశాస్త్ర విభాగాలలో నోబెల్ బహుమతులు వచ్చాయి. ఉన్నత స్థానాలలో పనిచేస్తున్న భారతీయుడు లేని ఒక ప్రముఖమైన విశ్వవిద్యాలయాన్ని గానీ లేదా ప్రసిద్ధికెక్కిన పరిశోధనాసంస్థను గానీ, యు.ఎస్.లో చూపించడం ఈనాడు కష్టమే! మనదేశంలో పరిస్థితి ఎలా వుందో పరిశీలించి చూస్తే ప్రతిభగల విద్యార్ధినీవిద్యారులు గణితము, భౌతిక, రసాయనశాస్త్రాలను చేపట్టకుండా ఆర్థికంగా ఎక్కువ ఆకర్షణీయమైన ఎకనామిక్స్, కామర్స్, ఇంజనీరింగ్, మెడిసిన్ రంగాలను ఎంచుకొంటున్నారు. ఒకవేళ ముందు ఫ్యూర్ సైన్స్ లో చేరినప్పటికీ లాభసాటి అయిన ఈ రంగాలలో అవకాశం లభించిన మరుక్షణం మారిపోతున్నారు. చాలామటుకు మన దేశీయ విశ్వవిద్యాలయాలు పరిశోధనకు రెండవ స్థానాన్ని ఇస్తూ కేవలం బోధనా కళాశాలలుగా వర్తిస్తున్న స్థితి ఉంది. తన్మూలంగా ఫ్యూర్ సైన్సెస్‌లో పరిశోధకశక్తితో చేరిన వారికి నూతన పరిశోధనాంశాలతో పరిచయం కానీ అవగాహనకు గానీ అవకాశం లభించడం లేదు. అందువల్ల వారు ఎక్కువగా విశ్వవిద్యాలయాలలో కంటే పరిశోధనా సంస్థలలో చేరుతున్నారు. సైన్స్లో నోబెల్‌ను తెచ్చుకొన్నవారు ఎక్కువశాతం విశ్వవిద్యాలయాలకు చెందిన ఆచార్యులే. చికాగో విశ్వవిద్యాలయం నుండి ఎక్కువ సంఖ్యలో నోబెల్ పురస్కారం పొందిన ఆవిష్కరణలు  జరిగాయి. మన దేశంలో  అండర్ గ్రాడ్యుయేట్ బోధన అనుబంధ కళాశాలలో విద్యార్థులకు అందిస్తూ ఆ స్థాయిలో వారికి పరిశోధనాత్మక ప్రయోగాల నిర్వహణలో ప్రవేశం లేకపోవడాన్ని చూస్తున్నాము. విద్యార్థులకు నాణ్యమైన బోధన, పరిశోధన, అధ్యయనాలు పరస్పర అనుసంధానంతో అందివ్వగలిగితే మనదేశ చరిత్రలో నిలిచిపోయే మంచి పరిశోధనా ఫలితాలను సాధించగలుగుతుంది. మన పరిశోధనా పరిశోధనారంగానికి కావలసిన సాంకేతిక సదుపాయాలు సరిపడినంతగా లేకపోవడం, నిథుల కొరత కూడా దేశీయ పరిశోధకుల కృషికి అడ్డంకిగా నిలుస్తున్నది. ఉన్న సదుపాయాలను ఎంతవరకూ ఉపయోగంలో వుంటున్నాయనే ప్రశ్నను వేసుకోవలసిన పరిస్థితి కూడా ఉంది. "షాజహాన్ తాజమహల్‌ని చనిపోయిన తన ప్రియురాలిని పాతిపెట్టడానికి నిర్మించాడు. మన జాతీయ ప్రయోగశాలలు వైజ్ఞానిక పరికరాలను పాటిపెట్టడానికి నిర్మించబడ్డాయి." అని సి.వి.రామన్ గారు ఒక సందర్భంలో అన్నారు. ఆయన కాలంలో విద్య, పరిశోధనలకు సదుపాయాలు మనదేశంలో చాలా పరిమితంగా ఉండేవి. అయినప్పటికీ అప్పట్లోనే అంతర్జాతీయ స్థాయిలో చెప్పకోదగ్గర పరిశోధన ఫలితాలను రాబట్టగలిగి ప్రసిద్ధికెక్కిన జె.సి.బోస్, ఎస్.ఎన్.బోస్, మేఘనాథ్‌సాహా, హోమీబాబా, పి.సి.రే, బీర్బల్‌ సహానీ వంటి వారున్నారు. ఈనాడు వైర్‌సెస్  కనిపెట్టినది జె.సి. బోస్ అని మార్కొని కాదనీ ప్రపంచం ప్రకటించింది. బోస్ తనకు అవసరమైన పరికరాలను తానే తయారుచేసుకొన్నాడు. రామన్ ఫలితం కనుగొనడానికి అతను వాడిన పరికరం విలువ రెండు వందల రూపాయలు మాత్రమే! ప్రతికూల పరిస్థితులలో సైతం పట్టుసడలనీయక పరిశోధనను కొనసాగించి ఫలితాలను పొందగలిగిన భారతీయుడతను.

 మన పాఠశాల విద్యార్థినీ విద్యార్దులలో సహజంగా ఉన్న ప్రశ్నించే తత్వాన్నీ స్పజనాత్మకతను పెంచి పోషించే విధానాలలో పాఠ్యాంశాల రూపకల్పన, బోధనలు ఉన్నట్లయితే వారు నూతన ఆవిష్కరణలకు కృషి చేస్తారు.  ఈ సందర్భంగా "నా అమ్మమ్మ నను విద్యావంతురాలిని చేయదలచింది. అందుకే ఆవిడ నన్ను ఎన్నడూ స్కూల్‌కి పంపలేదు" అని మార్గరెట్ మీడ్ చెప్పిన సంగతిని మనం గుర్తు తెచ్చుకోవడం మంచిది. పాఠశాలలోనే మన భారతీయ సంతానం ప్రపంచస్థాయిలోనూ తన ఆవిష్కరణలను చేయడానికి కావలసిన బీజాలను నాటుకోవాలి. అప్పుడే మన భారతీయ మేధోసంపత్తి బయటపడుతుంది.

రచయిత్రి: డా. చాగంటి కృష్ణకుమారి. తెలుగు విద్యార్థి పత్రిక - ఫిబ్రవరి  2013 సౌజన్యంతో ....


Sent by MediaWiki message delivery (talk) on behalf of {{U|User:Technical 1

No comments:

Post a Comment